రగలబోతున్న ‘కుచ్ ‘ కరోనా


బయట ఎండగా ఉంది అలా లేక్ దాకా వెళ్దామని బస్సు ఎక్కాం. మధ్యలో డ్రైవర్ సడన్ గా బస్సు ఆపి వెనక్కి వచ్చి ఒకడిని మాస్క్ పెట్టుకో అని మర్యాదగా చెప్పాడు. వాడు ఎదో గొణుగుతూ దానికి నిరాకరించాడు. డ్రైవర్ కి అరికాలి మంట నషాలానికి ఎక్కినట్లుంది, నువ్వు మాస్క్ పెట్టుకోనేదాకా బస్సుకదలదు అని నిర్మొహమాటంగా చెప్పేశాడు. పైగా అదేమన్నా రద్దీగా ఉన్న బస్సా అంటే తిప్పి తిప్పి కొట్టినా 6 ఉన్నాం. (నాకళ్ళముందు రౌండ్ రౌండ్ గా చక్రాలు తిరిగాయి… అదేనండి ఫ్లాష్ బాక్ అన్నమాట. ఇంటర్లోనో డిగ్రీలోనో ఇంగ్లీషులో మాకు నారయణన్ రాసిన ఒక స్టోరి ఉండేది…ఒకామె కుక్కపిల్లతో బస్సు ఎక్కితే డ్రైవర్ రూల్స్ ఒప్పుకోవు అని కుక్కపిల్లతో సహా ఆమె బస్సు డెక్ మీదికి ఎక్కేదాకా బస్సును కదలనివ్వడు…) ఇంకా బయటకి వచ్చేయండి…20 నిమషాలు అయ్యినా ఏమార్పులేదు. తోటి ప్రయాణికులు వాడిని మృదువుగా (ఈ జర్మన్లకి తిట్టటంలో ఓ స్టైల్ ఉంటుంది, మనం బుర్ర పెట్టి ఆలిచిస్తే ఇంత బండ బీప్…బీప్….ఆ అని అర్ధమవుతుంది) మందలిస్తున్నారు. ఈ మధ్యలో ఎవరో పోలీసులకి ఫోన్ చేసినట్లున్నారు, బస్సుని ఇంతసేపు ఆపినందుకు, పబ్లిక్లో నాన్సెన్స్ సృష్టించినందుకు, మాస్క్ పెట్టుకోనందుకు మొత్తం కలిపి భారతీయ ధనంలో ఒక 24,000 మాత్రమే ఫైన్ వేసి వాడిని స్టేషన్ కి తీసుకెళ్ళాడు.

వీళ్ళ రూల్స్ ఎంత స్ట్రిక్టంటే ఏప్రియల్ నుండీ కె.ఎన్ 95 మాస్కులని మాత్రమే వాడాలని ప్రభుత్వం ఫత్వా జారీచేసింది. అవికాకుండా సాధారణ మెడికల్ మాస్కులతో తిరిగినా బాదుడే, కనీసం సూపర్ మార్కెట్ వాడు కూడా రానివ్వటంలేదు. ఇక లేక్ దగ్గరైనా ప్రశాంతంగా ఉన్నామా అంటే 4గురు కన్నా ఎక్కువమంది ఒకచోట కూర్చుంటే మల్లీ ఫైన్, ఒక పచ్చ జాకీటు చేతిలో ఒక కెమేరా ఇచ్చి ప్రభుత్వం కొత్త ఉద్యోగుల్ని దేశం మీదికి వదిలింది….

వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కరోనా నిబంధనలని పాటించకపోతే ఫొటో తీసుడు, ఫైన్ వేసుడే…డబ్బులు లేవంటే ఏంచేస్తారు అని దబాయింపు ప్రశ్న వేయకండి… ఇంటికి వస్తది బిల్. పోయినవారమే కట్టా నేను కూడా… 30 వెళ్ళాల్సిన చోట 40 లో వెళ్ళి. అది నిబద్ధత అంటే…

ఇంతకీ ఇది ఎందుకు చెబుతున్నాను అంటే…. ఇంటికి వచ్చి బయటనుండీ తెచ్చుకున్న ప్రాన్ బిర్యానీ తింటూ, పవన్ గారి ప్రసంగం విందామని టివి పెట్టా… కరోనా సమయంలో ఈ జనసందోహం చూసి పళ్ళెంలో ప్రాన్ ఫోర్క్ లేకుండ నోట్లో పడింది.

మీలో ఒక్కడికి కరోనా వచ్చినా ఈ రాజకీయ నాయకులు మీకోసం కనీసం కన్నీటి బొట్టు రాల్చరు. యువతకూడా ముందూ వెనకా ఆలోచించకుండా ఏంటో ఈ వేలాం వెర్రి.

యువతా!! – భావి భారత భవిత???

తెలుగు-పలుకు


Telugu Palukulu

రెండు రోజులక్రితం ఆస్ట్రేలియా నుండీ శ్రీనివాసుగారు కాల్ చేసి తెలుగు-పలుకు మాసపత్రికను గురించి చెప్పారు. పుస్తకాలు చదవటం మర్చిపోతున్న ఈరోజుల్లో అందునా తెలుగు పత్రికను విదేశాల్లో నడపటం కత్తిమీద సాములాంటిదే. విదేశాల్లో ఉంటున్న తెలుగు కుటుంబాలకి చెందిన చిన్నపిల్లలకి తెలుగు భాషమీద (ఇది నా మాతృభాష అన్న) అభిమానాన్ని, ఆసక్తిని కలిగించటానికి వీరు తెలుగు పత్రికని రూపొందించిన విధానం బాగుంది. విదేశాల్లో ఉన్న తెలుగు పిల్లలకు తెలుగు భాషలో రాయటం, చదవటం మొదలైన విషయాలలో పోటీ పెట్టి గెలిచినవారి ఫొటోలను ఈ పత్రిక ముఖచిత్రంగా ముద్రించటం కొత్త ఆలోచన (ఆర్ధిక బహుమతితోపాటు). తెలుగు భాషకు ఇటువంటి సేవచేస్తున్న శ్రీనివాస్ గారికి వారి బృందానికి హృదయపూర్వక అభినందనలు.

పొంగటి మేలుతలపులు


మిత్రులందరికీ “పొంగల్” శుభాకాంక్షలతో…..
“పొంగల్” శుభాకాంక్షలు అనగానే పొంగల్ తమిళ పదం అని, ఇంగ్లీషు పదంఅని వాదోపవాదాలు, ఏ భాషలో ఐనా ఒక పదం పురుడు పోసుకుని ఆ సమాజంలో ఆ పదం నిలతొక్కుకోటానికి పడేశ్రమ భాషాశాస్త్రవేత్తలకే తెలుస్తుంది. అలాంటి ఎన్నో తెలుగు పదాలు ఈ తెలుగు (అంధకాసుర) సమాజం పురిట్లోనే నిర్ధాక్షిణ్యంగా చంపేసింది. అలాంటి మృతశిసువుల్లో ఈ “పొంగల్” కూడా ఒకటి. కనుమరోజు పితృతర్పణం కోసం ఎదురుచూసే ప్రేతాత్మల్లా ఈ మృత తెలుగు పదాలు బూజుపట్టిన ప్రాచీన తెలుగు కావ్యాలలో ఎవరన్నా మళ్ళీ తమకి పునర్జన్మ ఇవ్వకపోతారా అని ఆశతో ఎదురుచూస్తున్నాయి.

పొంగలి అన్న పదం గురించి ఒక చర్చ (కొలచిన పోస్ట్):

పొంగలి తెలుగు పదమే. సంక్రాంతి అన్న సంస్కృత పదం తెలుగులోకి రాకముందు నుండే తెలుగు నాళ్ళలో పంటచేతికి వచ్చిన తరువాత జరుపుకొనే పెద్ద పండగగా పొంగలి జరుపుకొనేవారు.

తెలుగు కావ్యాలలో కొన్ని ప్రయోగాలు:

పండుగులకు వాల పబ్బంబులకు

బొంగలికిని దేవరకు గొబ్బికిని..

 కొఱఁత పడకుండఁ గుండ లా కుమ్మ రిచ్చు. 

(హంసవింశతి .5.14)

క.

ఈ రీతి నుండ మచ్చిక

దేర న్వలసినవి యెల్లఁ దెప్పించుటకై

వారసతు ల్బొజుఁగులతోఁ

జోరామి యొనర్పఁ బసుల పొంగలి వచ్చెన్

(శుక సప్తతి. 2.562)

(పసులపొంగలి=మకరసంక్రాంతి మఱునాఁడు పశువులను అలంకరించి చేసే ఉత్సవము)

శ్రీరంగమున నాస దీఱంగఁ బొంగళ్లు

భోజనం బొనరింపఁ బొడము దప్పి 

(అనిరుద్ధచరిత్రము 1.41)

పొంగటినెల, పొంగటిపండగ, పొంగటికుండ వంటి ప్రయోగాలు కూడా మనకు ప్రాచీనంగా కనిపిస్తాయి.

ఈ రకంగా ఎన్నో అచ్చ తెలుగుపదాలు సంస్కృత పదాల వెల్లువలో కొట్టుకుపోయాయి.

మీ దేవుళ్ళ పేర్లు చెప్పండి అని ఒక తెలుగు వాడిని, ఒక తమిళం వాడినీ అడగండి. తెలుగు దేవుళ్ళు (తెలుగు దేవుళ్ళ పేర్లను) ఎప్పుడో తెలుగు నేలమీద హత్యగావించబడ్డారు. తెలుగు వారు వాడే దేవుళ్ళ పేర్లన్నీ సంస్కృతం పేర్లే. ఆంధ్ర నామ సంగ్రహం ఆంధ్ర నామ శేషం లాంటి ప్రాచీన నిఘంటువుల్లో మీ అచ్చ తెలుగు పదాలు నిజమైన తెలుగు పండగల పేర్లు, స్వచ్చమైన తెలుగు బంధువాచకాలు కనిపిస్తాయి.

భాష సమాజం సంస్కృతి ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉంటుంది. భాష లేకుండా సమాజం ఉండదు సమాజ అస్తిత్వానికి సంస్కృతి పునాది. మాతృభాషను చంపుకునే సమాజం తన పునాదులల్ని తానే కూల్చుకుని సంకర సంస్కృతితో కడుపునింపుకొటానికి దేశాలు పట్టి పోతుంది (అలగ్జాండర్ ఈజిప్ట్ నాశనానికి వాడింది ఈ సూత్రమే). “జర్మన్” అన్న ఒక్క పేరు చెప్పుకుని ఈ 75+ సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఎన్ని గొర్రెల్ని విదేశాలకు (ఎన్ని కోట్ల వ్యాపారం) అమ్మొచ్చో చూసి ఈ జర్మన్ వాళ్ళే ఆశ్చర్యపోయారు.

ఇంతకీ ఈ మృతతెలుగు పదాల పునర్జన్మకి కృషిచేస్తుంది తెలుగు వారు కాదు పాశ్చాత్యులు. సాంకేతికతతో వీటికి మళ్లీ పాణం పోస్తున్నారు.

డేటా పట్టించిన మిత్రుడు


నా ప్రతి క్లాస్ లోనూ రెండు విషయాలు తప్పకుండా చెబుతాను. 1. నీ మాతృమూర్తి నిన్ను ఎలా మోసం చేయదో నీమాతృభాష కూడా నిన్ను మోసం చేయదు నువ్వు మనస్పూర్తిగా ఆరాధిస్తే. 2. నీ వేలి ముద్రలు ఎంత యునిక్ గా ఉంటాయో నీ భాష (రాతరూపంలో గానీ పదజాల రూపంలో) కూడా అంతే యునిక్ దీనితో సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన ఉపకరణాలు చేయొచ్చు అని.

నిన్న డేటా క్రాలింగ్ చేస్తూ ఉంటే అనుకోకూండా పోలీసు లంచాల మీద ఆసక్తి కరమైన చర్చ కు చెందిన డేటా దిరికింది. దాంట్లో ఒక వ్యక్తి చేస్తున్న కామెంట్లు అతని కొన్ని ఊతపదాలు చూసి ఎక్కడోతేడా కొడుతోంది అని ఆ ఐడిని ట్రేస్ బ్యాక్ చేసి మొత్తానికి అతన్ని సంప్రదిస్తే ఆంధ్రా పోలీస్ డిపార్ట్ మెంట్లో ఒక సీనియర్ ఆఫీసర్ గా ఉన్న బాల్య మితృడు అని తెలిసింది. కానీ 2020 నుండీ యూనీఫాం లేని పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నాడని తెలిసింది.

అతనితో మధ్యమధ్యలో చేసిన సంభాషణలో లంచాలు, పోలీసు వ్యవస్తలో ఈ మధ్య ఆంధ్రా పోలీసులు యూట్యూబ్లో చేసే షోవర్కులు ఏదో అద్భుతం జరుగుతోంది అని విళ్ళు ఇచ్చే బిల్డప్ లగురించి మాట్లాడుతూ అతను చెప్పిన కొన్ని విషయాలు.

  1. పోలీసులు లంచాలు తీసుకుంటున్నారు అని ఏడ్చే ప్రజలు ఒక్క లంచ గొండి పోలీసునైన పట్టుకుంటానికి ప్రయత్నించారా (వాళ్ళా వాయిస్ రికార్దు వీడియో రికార్డు). కారణం ప్రజల బానిసత్వం భయం.
  2. కాళహస్తి సి ఐ పబిల్క్ గా కొడుతుంటే చూస్తూ ఉన్నారుగాని ప్రజలు వెళ్ళి ప్రశ్నించారా?
  3. యూట్యూబుల్లో సోషల్ మీడియాలో షోవర్క్ ఇచ్చే ఐపిఎస్ లని మీరు సూపర్ సర్ మీరు డి ఐ జి అవ్వలి సార్ అని కామెంట్లు పెట్టే భట్రాజులే గానీ సార్ మా ఊళ్లో ఈ అన్యాయం జరుగుతోంది దీని మీద చర్యలు తీసుకోండి అని కామెంట్లు పెట్టి దాని మీద ఆ ఐ పి ఎస్ చర్యలు తీసుకునేదాకా పోస్టులు పెట్టే చదువుకున్న ఒక్క దైర్యవంటుడైనా ఉన్నాడా?
  4. మా మాటల మధ్యలో మా రేపల్లె రైల్వే స్టేషన్లో జరిగిన రేప్ సంఘటన చర్చకి వచ్చింది. రేపల్లెలో ఉంది ఒకే ఒక రైల్వే స్టేషన్ ఫ్లాట్ పాం రేప్ జరిగిన స్థలానికి 100 మీటర్ల దూరంలో అదే ప్లాట్ ఫాం మీద పోలీస్ స్టేషన్ ఉంది. 100 మీటర్ల దూరంలో రేప్ జరుగుతుంటే పోలీస్ స్స్టేషన్లో ఉన్న రైల్వే పోలీసులు ఏంచేస్తున్నారు (వీరు రైల్వే పోలీసులు బయట పనులు కూడా ఉండవు). మరుసటి రోజు అదే ఫ్లాట్ ఫాం మీద బాపట్ల ఎస్పీ ప్రెస్ మీట్ పెడితే ఒక ఐ పి ఎస్ రైల్వే పోలీసుల గురించి కనీసం ప్రస్తా వించలేదు గంగిరెద్దు మీడియా తలాడించుకుంటూ చెప్పింది రాసుకుందికా నీ ఒక్కడైనా రైల్వే పోలీసులు ఏమయ్యారు అని ప్రశ్నించారా? రేప్ జరుగుతుంటే బాధితురాలి భర్త మొదట రైల్వే పోలీసు స్టేషన్ కి వెళ్ళి తలుపులు కొట్టాను ఎవరూ లేరు అక్కడ అని చెప్పిన వీడియో టేపులు సోషల్ మీడియా నుండీ తర్వాత కాలంలో ఎందుకు డిలీట్ అయ్యాయి? వీటిని ఎవరు ప్రశ్నించాలి? భయంతో, నాకెందుకులే అని అనుకే ప్రజలకి నిజాయితీ సేసేవలు మాకు కావాలి అని అడిగే హక్కు ఉంటదా?
  5. షుమారు 20 ఏళ్ళ తన సర్వీసులో ప్రస్తుత ఆంధ్రాలో అతను చెప్పింది 2 ఐ పి ఎస్ లు తప్ప అందరూ సప్త వ్యసన బానిసలై సోషల్ మీడియాలో ఏదో అద్బుతం చేస్తున్నాం అని ఈ గంగిరెద్దు జాతికి షోవర్క్ ఇచ్చేవాళ్ళే. అతను నన్ను అడిగిన ప్రశ్న … తను నిజాయితీ పరుడు అని చెప్పిన 2 ఆంధ్రా ఐ పి ఎస్ లూ ఈ పోలీసుల బిల్డప్ సోషల్ మీడియా చానల్స్ లో ఎందుకు లేరు? (ప్రస్తుతం ఆ ఇద్దరు ఐ పి ఎస్ లూ సెంటర్ సర్వీసులకి వెళ్ళీ పోయారు) .అసలు వీళ్ళ పేర్లు చెబితే ఎంతమంది గుర్తుపడతారు?
  6. లంచాలు తీసుకుంటూ కానిస్టేబుళ్ళు ఎస్సైలే ఎ సి బి కి ఎందుకు చిక్కుతారు. నెల నెలా పైకి పంపకపేతే తననే కొత్తలో సి ఐ ఎలా తిట్టేవాడో చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. అనుకోకుండా అదే రోజు సాయంత్రం లంచం తీసుకుంటూ తన మిత్రుడు సి బి ఐకి దొరికాడు కానీ వెనకున్న పై అధికారులు తప్పించుకున్నారు అని మెసేజ్ పెట్టి 2020 నుండీ తను యూనిఫాం లేని డిపార్ట్ మెంట్ కి ఎందుకొచ్చిందీ చెప్ఫాడు.

ఒక ఉన్నతమైన ఆఫీసర్ తను ట్రాన్స్ఫర్ ఐనా తన కింది స్థాయి వాళ్ళని తన నిజాయితీ నిబద్ధతో వాళ్ళ ని ఎలా ప్రభావితం చేస్తారో ఇతను పెట్టిన ఈ కింది ఒక్క మాట నిరూపిస్తుంది.

నా ఉద్దేశంలో ఆంధ్రా పోలీసులకన్నా తెలంగాణా పోలీసులు నిజాయితీ, నీతి, నిబద్ధతల్లో చాలా చాలా నయ్యం. ఆంధ్రాలో ఉన్నట్లు షో వర్క్ తెలంగాణాలో లేదు.

నోరు తెరిచి ప్రశ్నించని స్వార్ధ పరులకి, మేకప్ బిల్డప్ బ్యాచ్ లకి చివరికి మిగిలేది ప్యాకప్ (తట్టా బుట్టా సర్ధుకుని కడుపు చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకి వలస పోవటమే)

చరిత్ర చెరిగిపోదు


మనం చేసే ప్రతి పనీ కాలం అనే లేఖకుడు ప్రకృతి అనే పుస్తకంలో చిరస్థాయిగా ఉంచుతాడు. చరిత్ర చిరిగిపోదు చెరిగిపోదు. ఈ కింది వీడియోలో చూశాక అనిపించింది.

కలడు కలడు అనెడి వాడు కలడోలేడో?


వేదపాఠశాలలో ఉండే నామితృడు బ్రహ్మోత్సవాల ఫొటోస్ పంపుతూ ఉంటాడు.

ఈరోజు ఆ కాళహస్తి సి ఐ దాష్టికపు వీడియో చూశాక ఈ ఫొటో చూసి నవ్వు వచ్చింది. దేవుడా నాకు అదివ్వు దేవుడా నాకిదివ్వు నాకదిస్తే నీకిదిస్తా అనే నీతో బేరాలు ఆడుతుంటే అమ్ముడు పోయే ప్రభుత్వ ఉద్యోగులకి నీకు తేడా ఏంటి? ఈ జనంలో ఒక్కడైనా నా దేశం నా ప్రజలు నా పాలకులు న్యాయ మార్గంలో ధర్మంగా ఉండేలా చెయ్యి అని కోరుకుని ఉంటాడా? ఒకవేళ కోరుకున్నా వాడు ఏం ఇవ్వలేడు కాబట్టి వాడి మొర మనకి ఇచ్చే ఆఫర్స్ ముందు నిలిచే ప్రసక్తే లేదు. కలియిగ దైవం కదా నీమీద కలి ప్రభావం లేకుండా ఉంటదా? నీ ప్రధానార్చకుడే నీ పింక్ డైమండ్ తో రాజకీయ పాచికలు ఆడినా, పోనీలే మనోడేగా అని మౌనంగా ఉండిపోయావ్. ఆ తాటకి, తోపుడు బండి తో తనను పోషించే తన తల్లిని అర్ధ్నగనంగా రోడ్డు మీద లాగుతుంటే నిస్సహాయంగా రోదించే ఆ చిన్నపిల్లాడి మనో వేదన ముందు నిజంగా నాకు నివ్వు ఇవ్వాళ ఓడిపోయినట్లు కనిపిస్తున్నావ్. ఆ గరుడ వాహనం మీద గుంభనంగా తలదించుకుని మాడవీధుల్లో ఊరేగుత్న్నట్లు కనిపిస్తున్నావ్. ఆరోజు ద్రౌపతికి చీర ఇచ్చావో లేదో ఎవడూ చూసిన పాపాన పోలేదు, ఈరోజు నువ్వే దైవంగా ఉన్న ఈ కలియుగంలో నీ కొండ కి కూత వేటు దూరంలో జరిగిన ఈ కలియుగ కాఖీ కీచకులు చేసిన వస్త్రాపహరణం చూస్తూ బ్రహ్మాడమైన బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నావ్.

కలడు కలడు అనెడి వాడు కలడోలేడో?

నిప్పు నీరు


అదెందుకో తెలీదు కానీ నేను పుట్టిందీ పెరిగిందీ ఆంధ్రాలో ఐనా నా కుండే కొద్ది మంది ఆప్తమిత్రులు తెలంగాణానుండే. అందులోనూ అందరూ భౌతిక శాస్త్రం చదివిన వారే. సెంట్రల్ యూనివర్శిటీ ఇచ్చిన గోల్డ్ మెడల్ కన్నా అదే యూనివర్శిటీ ఇచ్చిన ఈ గోల్డెన్ మిత్రులు చాలా ప్రభావం చూపారు. ఈ మహాను భావుడు ఒకడు.

అన్నా!! లక్ష రూపాయల నీ కెమేరా ఎవడో కొట్టేశాడన్నా !!

అవునా అన్నా!! దాంట్లో నీ వాల్యుబుల్ డేటా ఏమన్నా ఉందా అన్నా!! అని కూల్ గా అడిగే మిత్రుడు .


25 సంవత్సరాల వయసులో పూనా యూనివర్సిటీ మైదానంలో సత్యసాయి దేవుడా కాదా అని సవాళ్ళు విసురుకుంటూ చేసిన ఆర్గ్యుమెంట్స్ నుండీ నేటి ఎంపీ శృంగారం వరకూ మా వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి.


అలా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నాం.


అన్నా! ఈ మధ్య ఆంధ్రాలో జరుగుతున్నవి చూసి చాలా ఆక్రోశం వేస్తోందన్నా దొంగ సర్టిఫికేట్లు,అధికారులే అమాయక ఆడపిల్లల్ని వాడుకోటం ఒక ఐపిఎస్ అంత పబ్లిక్ గా పట్టుబడ్డ వీడియో కనీసం లాబ్ కి పంపకుండా అబద్ధాలు ఆడటం ఇవన్ని చూసి మొద్దుల్లా గంగిరెద్దుల్లా తలూపుతున్న ఈ జానాన్ని ఆలోచించమని కొంచెం ఘాటుగానే పోస్టులు పెడుతున్నా అన్నా,

(అటునుంచీ) అన్నా చికెనా !! మటనా!!

అన్నా! ఇవ్వాళ వినాయక చవితి నేను నాన్వెజ్ తినను. (ఇంత సీరియస్ గా చెప్తుంటే ఫుడ్ గొడవ.. అని మనసులో నేను)

అప్పుడే సలాడ్, సమోసా స్టాటర్స్ తో వచ్చిన బేరర్ ని మావాడు “డూ యూ యావ్ ఉండ్రాళ్ళూ” అని అడుగుతూ ఇచ్చిన లూక్ లో వినాయకుడు వినాయక చవితిరోజు చికెన్ తొనొద్దన్నాడా? అన్న ప్రశ్న ప్రస్ఫుటంగా సమోసాలోకి దింపిన ఫోక్లా గుచ్చుకుంది.

ఫోక్తో వేడి వేడి పొటాటో మషాలాని ఆస్వాదిస్తూ చూడన్నా!! బేసికల్లీ మనిషి జంతువునుంచీ వచ్చాడు. ఆజంతువు పరిణామక్రమంలో సంఘాలుగా ఏర్పడి కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. నియమాలు పెట్టుకున్నంత మాత్రాన జంతువు జంతువు కాకుండా పోతుందా? ఆ జంతు స్వభావం అవకాశం దొరికినప్పుడల్లా నేనున్నా అని బయటకివస్తది. కాలం, ప్రకృతి అన్నింటికీ సమాధానం చెప్పేస్తది అన్నా. ఖర్మ అన్నది ఒకటి ఉంటది అన్నా వ్యక్తికైనా రాష్టానికైనా…. ఇంటికేళ్ళి స్వామి(సత్య సాయి) స్పీచెస్ పంపుతా ఎన్ని సార్లు విన్నా కొత్తగా ఉంటదన్నా విను, ప్రస్తుతం ఫుడ్ కుమ్మేద్దాం దా!!


నిప్పుల కుంపటి మీద పాలపొంగుకి నీరు చేరితే…మీగడ వృధాకాదు

Technology in Local Languages


Hugendubel is one of the biggest book stores in Germany. We can see few English books (can say approx 2% books). The interesting thing is the way Germans are bringing and translating the technology into local languages. Here you can see all technical books are in the German language, haven’t seen a technical book which is in the English language. If you buy an English book, you are paying your money to other countries. If you buy a local book, you are paying to your motherland. Bring technology into your local languages. If you have interest in such kind of job, please drop a mail at sganeshhcu@gmail.com

మద్రాసు ప్రెసిడెన్సీలో రేపల్లె సుబ్ డిస్టిక్ట్లో గ్రామాల పేర్లు


Under Section 5 of the Indian registration act III of 1877 Towns and Villages from Madras Presidency collected on 31-March-1888

మద్రాసు ప్రెసిడెన్సీలో రేపల్లె సుబ్ డిస్టిక్ట్లో గ్రామాల పేర్లు:

శ్రీలంకలో…


దివాళా తీసిన దేశంగా శ్రీలంక అని మనం చెప్పుకుంటున్నాం. నాదృష్టిలో అది కేవలం రాజకీయ వైఫల్యమే. ఈదేశంలో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని నాకు సమయందొరికినప్పుడు రాస్తాను.

  1. రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఐరోపా ఖండానికి పూర్తిస్థాయి ఆర్గానిక్ అందించే దేశాలలో శ్రీలంక ఓక్టి అవుతుంది. దేశం మొత్తం మీదా ఒక్క రసాయన ఎరువుల దుకాణాన్ని కూడా చూడలేదు.
  2. కాలుష్యం లేని దేశం (వాహనాల పొగగొట్టాలనుండీ నల్లటి పొగరావటం అసలు చూడలేదు.), ఏమూలకెళ్ళినా పచ్చదనం.
  3. ఐరోపాను తలపించే అద్భుతమైనరోడ్లు.
  4. మంచి సహజ సిద్ధమైన ఆహారం. చాలా బలమైన నేల.
  5. ముఖ్యంగా ప్రజల్లో నీతి నిజాయితీ, విలువైన నా కెమేరా రెండు సార్లు పోయినా మళ్ళీ నా దగ్గరికి చేరింది. మా స్థానిక డ్రైవర్ పర్స్ పోగొట్టుకున్నా, లోపల ఉన్న డబ్బుతో సహా తిరికి పోస్టుచేశారు.
  6. అద్భుతమైన ఆతిధ్యం. నా జర్మన్ మిత్రులు అక్కడే ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు
  7. మనదగ్గర పెట్రోల్ 100 రూపాయలు ఉన్నప్పుడు అక్కడ 55 శ్రీలంకన్ రూపాయలు (in the month of Jan 2022) . ఎంత తక్కువోచూడండి. భారత్ పెట్రోలియం లిమిటెడ్ దగ్గర కొన్న పెట్రోల్ భారత దేశంకన్నా తక్కువ రేటుకి ప్రజలకి అమ్ముతున్నారు.
  8. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలని నడిపేవాళ్ళని, వెనక హెల్మెట్ లేకుండా కూర్చుని ప్రయాణించే వాళ్ళని నేను చూడలేదు

1980 ప్రాంతంలో సింగపూర్ వాళ్ళు శ్రీలంకలా అభివృద్ధి చెందాలని అనుకునేవాళ్ళంట. సరైన నాయకులు మళ్లీ వస్తే ప్రంపంచానికి అగ్రీ ఫూడ్ అందించే అద్భుత దేశం శ్రీలంక. ప్రకృతి ప్రేముకులకి స్వర్గ ధామం ఈ పులస్య బ్రహ్మ ధామం.
శ్రీలంకలో వాళ్ళకి ఏంనచ్చాయో మా తల్లిదండ్రుల మాటల్లో క్లుప్తంగా….. మీకు నచ్చితే నా యూటూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోగలరు….

Video-1

Video-2, Video-2.1

కుదిరితే ఇదికూడా చదవండి. https://sgthottempudi.wordpress.com/2022/03/01/హిందూ-మహాసముద్రం-మధ్యలో

తమ్ముడు శ్రీకర్ కి ధన్యవాదాలు. సమయంఉన్నప్పుడు ఒక్కో విషయాన్ని వివరంగా వివరిస్తాను వీడియోలతో.

హిందూ మహాసముద్రం మధ్యలో అయ్యవారు (శివుడు) లేని శైవక్షేత్రం


మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
ఈ రోజు ఈనాడు పత్రికలో అమ్మవారు లేని శైవక్షేత్రం వార్త చదివాక ఈ మధ్య నేను చూసిన హిందూ మహాసముద్రం మధ్యలో, నాగద్వీపం లో ఉన్న అయ్యవారు (శివుడు) లేని శైవక్షేత్రం గురించి చెప్పాలనిపించింది. ఇక్కడ దొరికిన ప్రాచీనమైన బ్రాహ్మీ లిపి శాసనాలు నాగులు, యక్షులు ఈ ద్వీపాల్లో ఉండేవారని, బుద్ధుడు ఈ నాగద్వీపంకి స్వయంగా వచ్చి నాగుల్ని బౌద్ధం వైపు మరల్చినట్లు చెబుతారు. ఈ ద్వీపం బౌద్ధులకి పవిత్ర స్థలం. బుద్ధుడు స్వయంగా కాలిడిన ప్రాంతం. మన ఆంధ్రులకి(నాయక రాజులు) ఈ ద్వీపానికి కూడా దగ్గర సంబంధం ఉంది. మరిన్ని వివరాలు త్వరలో విపులంగా రాస్తాను.

*ఇదేగా మన ఆంధ్రోడి #ఆరంభ_సూరత్వం*🤣 🤫🤫🤫🤦‍♂️🤫🤫🤫 *


*తెలుగువారు (ఆంధ్రాలో) ఎప్పటికినీ #ఆరంభసూరులు మాత్రమే…!!!*

*ఆ శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు….!!!* .

పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగ చరిత్ర చదువుతుంటే కళ్లలో నీళ్లు ఆగటం లేదు..

*ఆంధ్రాలో తెలుగు వాళ్ల చేవ చచ్చిన తనం పైన వికారం పుడుతోంది.*

ఆయన జీవితం స్కూల్లో పాఠాలుగా చదువుకున్నాం. కానీ అది సగం సగం నిజాలతో కూడిన ఫ్యాబ్రికేటెడ్ చరిత్రని అని ఈ పరిశోధనాత్మక కథనం చూశాక అర్థమైంది.

*ఒకటి మాత్రం నిజం.. పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి నాడే కాదు.. దశాబ్ధాల తరబడి…ఈనాటికీ అవమానం జరుగుతూనే వుంది.

* నాటి గుడివాడ నివాసి… అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గుడివాడ గడ్డ నుండే ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం నిరహారదీక్ష కు పూనిన సంకల్పానికి సాక్షిగా ప్రతి తెలుగు వాడూ తెలుసుకోవలసిన వాస్తవ విషయాలు… తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన 58 రోజులపాటు మద్రాసు నగరంలో నిరాహార దీక్ష చేసి ఆ దీక్షలోనే చనిపోయారు. ఆయన శవాన్ని మోసేందుకు కనీసం నలుగురు మనుషులు కూడా లేని నిస్సహాయ స్థితిలో అనాధగా అభాగ్యుడిగా ఆయన అసువులు బాసారు. నిజానికి పొట్టి శ్రీరాములుగారి గురించి ఆయన చేసిన త్యాగం గురించి చరిత్ర ఒక నల్లని దుప్పటి కప్పుకుంది. అమరజీవి పేరుతో ఈరోజుకు మాత్రం ఒకసారి ఆయనను తలుచుకుని అమర్ రహే అనుకుని మన పని మనం చేసుకుంటాం. ఆర్యవైశ్యులు ఆయన కులస్తులు కాబట్టి వాళ్ళే చూసుకుంటారని ఒక గుడ్డి కులం ముద్రను ఆయనకు వేసి మిన్నకుంటాం. ఎంత డొల్లతనం మన తెలుగువారిది. ఏది సీరియస్ గా తీసుకోవాలో ఏది వదిలిపెట్టాలో దిశ దశ లేక తెలుగుజాతి ఇలా నీరుగారిపోవటమే నేటికీ దేశ స్థాయిలో తెలుగువారంటే చేతగానితనం అనిపించుకుంటానికి కారణం. పక్కనే ఉన్న తమిళులు భాషా, సంస్కృతి , సంప్రదాయాలతో తమ జాతి ప్రత్యేకత కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటుంటే దానిని గొప్పగా చెప్పుకుంటాం గాని మనం మాత్రం మన జాతి పురుషుల గురించి కూడా సరిగ్గా తెలుసుకోము. ఇది ఎవరినో నిందించటానికి కాదు. మన తెలుగుజాతి కోసం నిండుప్రాణాలను తృణప్రాయంగా బలిచేసుకుని మనకు మాత్రం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పడ్డ కష్టం గురించీ వేదన గురించి నేటి తరం కనీసం కొంచెమైనా తెలుసుకోకుండా చేశారే అనే ఆవేదన. పొట్టిశ్రీరాములు గారిది నెల్లూరు జిల్లా. ఐటిఐ చదువుకుని మద్రాసులో రైల్వే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన పట్ల విధి చిన్నచూపు చూడటంతో ఒకే సంవత్సరంలో భార్యా బిడ్డా తల్లీ కూడా వరుసగా చనిపోవటంతో ఆయన ఖిన్నుడైపోయాడు. ఇక తన జీవితానికి అర్ధం లేదని కుమిలిపోతున్నాడు. ఆ సమయంలో గాంధీజి మద్రాసు పర్యటన ఆయన ఆలోచనను మార్చివేసింది. ఎవరికీ కొరగాని ఈ జీవితం బాపూజి సబర్మతీ ఆశ్రమంలో ఆయన శిష్యరికంలో గడపడమే సబబని తోచి సబర్మతీ వెళ్ళిపోయారు. అక్కడ గుడివాడ నుంచి వచ్చిన యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం కలిసి ఇద్దరూ తెలుగువాళ్ళు కావటంతో స్నేహం కుదిరింది. .

గాంధీజీ కోపం విసుగు :- . విరాగులు, స్వాతంత్ర సమరయోధులతో సబర్మతి నిండిపోయింది. గాంధీజీకి రోజురోజుకూ తన చుట్టూ చేరుతున్న వారి పట్ల విసుగేసింది. “నా చుట్టూ చేరి రోజూ భజన చేయటం కంటే పల్లెసీమలకు వెళ్ళి ప్రజలను అహింసా పద్దతిలో స్వాతంత్రం కోసం పోరాడటానికి సిధ్దంగా తయారుచేయండి వెళ్ళండి” అని వాళ్లకు ఉద్భోద చేసారు. తన ఊర్లో తనకు ఎవరూ లేరని బాధపడుతున్న శ్రీరాములను యెర్నేని సుభ్రహ్మణ్యం తాను గుడివాడ దగ్గర స్థాపించిన గాంధీ ఆశ్రమంకు రమ్మని ఇద్దరం కలిసి పనిచేసుకుందామని ఆహ్వానించారు. వెంటనే గాంధీజీ కి చెప్పి గుడివాడ బయలుదేరారు. కొమరవోలు చెంత గల గాంధీ ఆశ్రమానికి గాంధీజీ 3 సార్లు వచ్చి వెళ్ళిన ఘనత ఉంది. పొట్టిశ్రీరాములు తన మకాం గాంధీ ఆశ్రమానికి మార్చారు. కానీ గుడివాడ కూడలి ప్రాంతం కావటంతో ప్రతి రోజూ నడుచుకుంటూ 7 కిలోమీటర్లు దూరంలోని గుడివాడకు వచ్చేవారు. ఆయనకు వైద్యం తెలుసు. తన ఆయుర్వేదమూలికల కోసం గాంధీ ఆశ్రమంలో రెండు ఎకరాలు ప్రత్యేకం ఔషధ మొక్కలు నాటుకుని ఉచితంగా వైద్యం చేసేవారు. మానేపల్లి మల్లిఖార్జున గుప్త, కూరాళ్ళ భుజంగ భూషణరావు, మెండా నాగయ్య, రావూరి అర్జనరావు, గోరా తదితరులతో నిత్యం గాెంధీజీ కార్యక్రమాల గురించి చర్చించేవారు. గోరా నాస్తిక సభలకు కూడా వెళ్లేవారు. హరిజన దేవాలయ ప్రవేశం అంగలూరులో నిర్విహించారు. విదేశీ వస్త్ర బహిశ్కరణ, స్వాతంత్రం వచ్చాక నెహ్రూ నిత్యావసర సరుకుల పై కంట్రోల్ పెట్టడాన్ని వ్యతిరేకించి గుడివాడ బజార్లలో బియ్యం రాసులుపోసి అమ్మి పోలీసుల నుంచి కూడా గౌరవ మర్యాదలు అందుకున్నారు. పదేళ్ళు గడిచిపోయాయి. మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి పదవీచ్యుతుడయ్యాడు. *తెలుగువారంటే ఆరంభసూరులు* మాత్రమేనని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా *తెలుగువారు ఆరంభసూరులు* అని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. ఎవరూ లేని తన జీవితం తెలుగువారి ఆత్మగౌరవానికి ఉపయోగపడనప్పుడు వేస్ట్ అని మిత్రుడు సాధు సుభ్రహ్మణ్యంతో కూర్చిని ఒప్పించి తాను చనిపోయైనా సరే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధిస్తానని చెప్పారు. ఆయన ఆఖరి భోజనం వడ్డించిన 12 ఏళ్ల పోతరాజు రాధామనోహరి చెబుతూ ఆయన ఎప్పుడూ మజ్జిగన్నం బెల్లంతో తినేవారు. అదే వడ్డించాను. ఇదే నా ఆఖరి భోజనం అని చెప్పారు…..అంది. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో రైలు ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు. ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్లారా అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. భారతీయ భాషలకు భాషా ప్రయుక్త రాష్టాల పేరిట ఇస్తున్నారు కదా కాంగ్రెస్ అన్ని చోట్లా కూడా ఇస్తున్నదే కదా అని అడిగితే తెలుగు భాష కూడా ఒక భాషా? అన్నాడు. తెలుగు తమిళానికి చెందినదే ఆ భాష మాట్లాడే వారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం అవసరమే లేదు. అది అసలు ప్రత్యేకమైన భాష కాదు అన్నాడు. తెలుగు భాష యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరు కూడా అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగు వాళ్ళల్లో వున్న కాంగ్రెస్ నాయకులంతా మొఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా తమ కోసం తమ భాష కోసం ఒక రాష్ట్రం కోరి దీక్ష చేస్తుంటే ఇన్ని కోట్ల మంది తెలుగు వారిలో కూడా జాలీ దయ లేదు. కేవలం టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కానీ భజనపరులకే ప్రాధాన్యత నిచ్చే అధిష్టానానికి ఆయన వేదన పట్టలేదు. ఆయనకు కాంగ్రెస్ లో పార్టీలో బలం లేక, ఏమీ చెయ్యలేక కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. *పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగులు నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం కూడా నోటి నుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక బలంతో నిండుకుండలా వుండే శ్రీరాములు గారు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది.

* ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు. ఇక మరణించాక మరీ దారుణం. ఎంతో నిర్లక్ష్యం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన *శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు.

* చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా కృష్ణాజిల్లాకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని చెపితే ఆయన ఆశ్చర్యపోయి ఎంతో ఆవేదన పడి వెంటనే అప్పటికప్పుడు కదలి శ్రీరాములు గారి శవాన్ని ఉంచిన స్థలం దగ్గరకు వచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని కాకులు పొడవకుండా తాటాకులతో కప్పి వచ్చిన సుబ్రహ్మణ్యాన్ని “శ్రీరాములు గారి శవం ఎక్కడా”? అని ఘంటసాల అడిగారు. ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఈ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతులు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకు వెళ్ళటం సబబుకాదు అని

*తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు.* వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు.

*అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల గారు తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులు బాసిన అమరజీవి వయ్యా శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు.

*అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గార్కి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణ శవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో పచ్చి బూతులు తిడుతూ తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడకల్లారా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు….

* క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. అప్పటికి కానీ నెహ్రూ కదల్లేదు ఆ తరవాత ఆ మహానుభావుడు రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధా పోదని ఆంధ్రులకి *ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది.

* సాధు సుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు. గుడివాడలో పొట్టిశ్రీరాములు స్మృతికి ఓ హైస్కూల్ వెలిసింది. అదే ఎస్పీ.ఎస్ హైస్కూల్. గుడివాడ నిండా ఆయన విగ్రహాలు అనేక పాఠశాలల్లో వాసవీ సంఘాలు వారు పెట్టారు. కానీ ఆయన నిజమైన త్యాగచరిత్రను నేటి తరానికి అందించటంలో పూర్తిగా కృతకృత్యులు కావటానికి అంకితభావం కలిగిన దేశభక్తి, తెలుగుజాతిపట్ల పరిపూర్ణ ఆరాధ్యత నిండిన దూతలు అవసరం. తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి అన్ని బాధలు పడి ప్రాణాలను బలిచేసుకున్న ఆయన్ని ఆనాడే కాదు ఈనాడూ కుల పిచ్చి ముదిరిపోయిన తెలుగు నాయకుల్లో పట్టించుకునే వాళ్ళు లేరు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు పెట్టడం కూడా చెయ్యరు. స్మృతి చిహ్నం నిర్మాణం చేసే ప్రభుత్వం కూడా లేదు. ఆయనకు భారత రత్న కావాలని అడిగేవారు లేరు. తరరాలు మారుతున్న సరే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడైనా సరే *ఆంధ్రాలో మన తెలుగు వాళ్ల చేవ చచ్చిన తనం పైన వికారం పుడుతోంది.

* *ఇదేగా మన ఆంధ్రోడి #ఆరంభ_సూరత్వం*🤣 🤫🤫🤫🤦‍♂️🤫🤫🤫 *బ్రాహ్మణ చైతన్య వేదిక* (వీరిది పోస్ట్ చేయటం జరిగింది.)