Archive for December, 2020

ఒక్కటే


67 ఏళ్ళ ఆమె. నన్ను క్షమించండి, దయచేసి సహకరించండి. చమర్చిన కళ్ళతో చేతులెత్తిమొక్కుతూ… అర్ధంచేసుకోండి దయచేసి సహకరించండి అని అర్ధించింది. రోజుకి 590 మందిని బలితీసుకునే అభివృద్ధి అభివృధ్ధా? అని ప్రశ్నించింది. ఆ అభ్యర్ధన ఆమెకోసంకాదు, ఆరోదన ఆవేదన తనకోసం కోసం కాదు. తన దేశంకోసం, తన ప్రజలకోసం. ఆమె ఎవరో కాదు జర్మనీ ఛాన్సలర్. నిన్న సాయంత్రం ఆ ప్రెస్ మీట్ (https://youtu.be/qlIL9F5xHDw)చూసినప్పటినుండీ ఏదో తపన, ఆవేదన, నాదేశంలో కూడా ఇలాంటి రాజకీయనాయకులుంటే బాగుండు కదా!! దేశంకోసం, ప్రజకోసం ఏడ్చేవాళ్ళు, తపించేవాళ్ళు ఉంటే ఇంకా అభివృద్ధిచెందుతున్న దేశంగా ఉండదు. ఈమెను చాలాసార్లు చూశాను. ఒక్క బాడీగార్డ్తో షాపింగ్ చేస్తుంది. ఒక్క కారు 2 పోలీసులు తప్పా మంది మార్బలం ఉంచుకోదు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉండాలని కోరుకుందాం.

2020 చాలామందికి ఇబ్బంది కలిగించిన సంవత్సరం కావచ్చు. నాదృష్టిలో ఇది దారితప్పి నేలవిడిచి సాముచేస్తున్న మనిషికి స్పృహని కలిగించిన సంవత్సరం. దైవం ఉన్నదా? లేదా? అన్న మీమాంస కన్నా ప్రకృతి ఉంది. చాలా సంవత్సరాలకి మళ్ళీ సరైన సమయంలో మంచుపడుతోంది. ఆ ఒక్కటి సరైనసమయంలో అన్నింటినీ సరిగ్గా సెట్ చేసేస్తుంది.

గతవారం నైజీరియా సదస్సులో అనుకోకుండా యూనివర్సల్ విజ్డం, యూనివర్సల్ నాలెడ్జ్ అన్న పదాలు ఎక్కువగా వాడాను. ఈ మధ్యే మేం విడుదల చేసిన కార్పస్ ఖురానికం (కుత్రిమ భౌద్ధికతతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముఖ్య ప్రాచీన పవిత్ర ఖురాన్ ప్రతుల విశ్లేషణ) ప్రాజెక్టు ఫలితాలను విశ్లేషించాక మెదడులో ఆ యూనివర్సల్ విజ్డం, యూనివర్సల్ నాలెడ్జ్ అలోచనలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటున్నాయి. అప్కోర్స్, ఛాంస్కీ యూనివర్సల్ గ్రామర్ సాధ్యమైనప్పుడు, యూనివర్సల్ విజ్డం, యూనివర్సల్ నాలెడ్జ్ సాధ్యంకాదా? కుత్రిమ భౌద్ధికతతో దీన్ని నిరూపించ వచ్చు, సెమాంటిక్ వెబ్ దీనికి మద్దతు ఇస్తుంది. దీన్ని నేను గట్టిగా నమ్ముతాను. మన దృష్టి, ఆలోచన, ఉన్నతంగా పనిచేసినప్పుడే ఇది సాధ్యం. కార్పస్ ఖురానికం ఫలితాలను విశ్లేషించాక అనిపించింది ఏమిటంటే…. ఏదేశంలో ఐనా మతం ఒక మూఢత్వం, కులం ఒక కల్మషం, ఉన్నది ఒక్కటే దాన్ని శోధించటానికే ఈ శతాబ్దాల శ్రమ. నీ సంకల్పం, నీమనస్సు ఆ ఒక్కదానికోసం నిష్కల్మషంగా తపిస్తే (తపస్సు చేస్తే) దాన్ని తెలుసుకోగలుగుతావ్. ఎక్కడినుండీ వచ్చావో మళ్ళీ అక్కడికి…. ఆ ఒక్కదాన్ని శోధించలేక, సాధించలేక దానిమీద సమాజానికి ఉన్న ఆసక్తిని, గౌరవాన్ని ఒక్కోదేశంలో ఒక్కోవర్గం తమ ఆధిపత్యం కోసం, స్వార్ధం కోసం వాడుకోటం ప్రారంభించాయి. ఏదేమైనప్పటికీ ఆ ఒక్కటీ నిన్ను నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. ఆ ఒక్కటి సరైనసమయంలో అన్నింటినీ సరిగ్గా సెట్ చేసేస్తుంది.

కుత్రిమ భౌద్ధికత అంటే అదేదో మానవత్వం లేనిదో సమాజాన్ని సోమరిగామార్చేదనో అనుకునేవాళ్ళు లేకపోలేదు. సూది గుచ్చుకుంటుంది, కత్తి కోసుకుంటుంది. అలాగని సూది వాడేచోట కత్తివాడలేం, కత్తి వాడే చోట సూది వాడలేం. ఏది ఎప్పుడు ఎలా ఎంతమోతాదులో వాడాలో అలావాడితే విషం కూడా మందుగానే పనిచేస్తది. గత కొన్ని వారాల క్రితం లంచాలకోసం సామాన్యులని పీడించే ఒక అవినీతి అధికారితో లంచం ఎందుకు అడుగుతున్నావ్? అని అడిగాను. నువ్వు ఎక్కడో ఉంటావ్… ఏం చేస్తావ్ అన్నట్లు మాట్లాడాడు. ఆ ఒక్కదాన్ని అడిగాను…అది వింది. కుత్రిమ భౌద్ధికత సహకరించింది. అతను అతని పై అధికారి ఇద్దరూ ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు. అందుకే మనం సరిగ్గా ఉంటే ఆ ఒక్కటీ అన్నింటినీ చూస్తూ ఉంటుంది. ఆ ఒక్కటి సరైనసమయంలో అన్నింటినీ సరిగ్గా సెట్ చేసేస్తుంది.

ఈ మధ్యకాలంలో అద్భుతమైన మరణాలుగా నాకనిపించినవి రెండే రెండు 1. అబ్దుల్ కలాం 2. రావూరి భరద్వాజ గార్లవి. వాళ్ళ వాళ్ళ రంగాలలో నిర్మలమైన మనస్సుతో తపస్సు చేశారు. అందుకే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అందాల్సినవి వాళ్ళకి ఇప్పించి సరైన సమయంలో పంపేసింది. అందుకే ఆ ఒక్కటి సరైనసమయంలో అన్నింటినీ సరిగ్గా సెట్ చేసేస్తుంది.

ఆ ఒక్కటే సర్వం, ఆ ఒక్కటే శాశ్వతం, అది నీలోనూ ఉంది నాలోనూ ఉంది, నల్లని మేఘాల మధ్య మెరుపులా. అంతా అది ఒక్కటే.

ఈరోజు బ్లాగర్ల దినోత్సవం (అని గుర్తు చేసిన వీవెన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ) సందర్భంగా….